మా చిన్నప్పుడు క్యూరియా’సిటీ’లో…

ఆరోజు కాస్త లేటయింది. అంటే తొమ్మిదయిపోలేదు కానీ రోజూ వచ్చే ఏడింటి బస్సు మిస్సయింది. 3వ బ్లాకులోని రెండవ ఫ్లోర్ ఇంటిలోవాళ్ళు ఊరెళ్ళారు. ఒక పని తగ్గింది కదా ముందే వచ్చేయచ్చు అనుకుని హైరానాపడ్డా అరగంట లేటయింది. తను ఆపాటికి సాధారణంగా వచ్చేస్తుంది.

తను మా స్కూల్లో కొత్తగా చేరింది. అదేంటో స్కూలు తొమ్మిదింటికని తెలిసినా, ఏడింటికే వచ్చేసి, సన్నగేటులోంచి లోపలికి వెళ్ళి, గ్రౌండులో చెట్టు దగ్గర కూచుంటుంది. హెడ్ మిస్ట్రెస్ గారు ఇక్కడ వసతులు సరిగ్గాలేవు, బెంచీలు కూడా లేవు, పాఠాలు జరగవు,ఇక్కడ తనని చేర్చవద్దని చెప్పారట. కానీ వాళ్ళ నాన్నగారు (ఆయన కాలేజీలో టీచరంట) ‘మా అమ్మాయి హంగులలో కాదు, నిజంగా చదువు కోసం చదువుకోవాలి అని ఇక్కడే చేర్చారంట! గవర్నమెంటు స్కూలులో ఎవరికీ నో చెప్పలేరని మానస చెప్పింది.

హెచ్ ఎం గారు ఏ సెక్షన్లో కూచుంటావు అని తననే అడిగితే మా క్లాసని చెప్పిందట. అలా నాకు తను తెలిసింది. తను ఎవ్వరితో ఎక్కువ మాట్లాడదు.. అచ్చం మాధురిలాగా, ఇన్నేళ్ళకి మళ్ళీ అలాంటి అమ్మాయినే చూసాను. ఒకరోజు వర్షాన్ని చూస్తూ ఆ చెట్టు కింద నిలబడితే, తను కూడా అక్కడే కన్పించింది. ఏం చూస్తున్నావు అంటే, “మా ఊళ్ళో చెరువులో వర్షం వేరేరంగులో కన్పించేది, అదే చూస్తున్నా!” అని అన్నది. “వర్షం ఎక్కడైనా రంగులో ఉంటుందా,ఎక్కడపడితే అదే దాని రంగవుతుంది.” అన్నాను నేను. అలా మా స్నేహం మొదలైంది. వాళ్ళ కుటుంబం ఈ ఊరొచ్చి నెలరోజులే అయిందని, ఇంకా ఎవరూ ఫ్రెండ్స్ అవలేదని తెలిసింది.

girl-go-to-school-illustration_csp22627526

ఆ ఆలోచనల్లో ఉండగానే ఇంతలో నేను దిగాల్సిన బస్ స్టాపు వచ్చేసింది. అరె! ఈరోజు స్కూలు మెయిన్ గేటు కూడా తొందరగానే తెరిచేసారే, ఏమన్నా విశేషం ఉందేమో అనుకుంటూ లోపలికి వెళ్ళాను. అదిగో తను ఆ చెట్టు దగ్గరే ఉంది. తన దగ్గర ఎప్పుడూ ఒక నోటు పుస్తకం ఉంటుంది. అందులో ప్రపంచంలో తను వెళ్ళాలనుకునే ప్రదేశాల ఫోటోలు అన్నీ అతికించి ఉంటాయి. మేము ప్రతి ఆదివారం న్యూస్ పేపర్లో వచ్చే ఆదివారం అనుబంధం పుస్తకంలో వేసే కొత్త, ఆసక్తికర ప్లేసులు, సైన్సు విషయాలను కట్ చేసి, ఇదిగో ఇలా స్కూలు టైముకి ముందుగానే వచ్చేసి అందులో కలిసి అతికిస్తాం. అలా సైలెంట్ గా ఉండే గ్రౌండ్లో, చెట్టు కింద నీరెండలో ఆ పుస్తకం మొత్తం తిరగేస్తూ ఉంటే,ఏదో ఒక రోజు ఆ ప్లేసులన్నిటికీ వెళతామని, మా పేర్ల పక్కన రాసుకున్న డిగ్రీల అక్షరాలన్నీ నిజమైపోతాయని, అందరూ మమ్మల్ని అలానే పిలుస్తారని నిజంగా అన్పించేది.

అలా ఆరోజు కూడా మొదటి బెల్ మోగటంతో ఈ లోకంలోకి వచ్చాం. ఇక వెళ్ళి క్లాసులో బ్యాగులు పెట్టేసి ప్రేయర్ కి స్టేజీ మీద రెడీ అవ్వాలి. పక్కకి చూస్తే తను లేదు. చెట్టు నుంచి స్కూలు వెనకవైపుకి ఎందుకెళ్తోందబ్బా అని నేను కూడా వెనకగా వెళ్ళాను. ఇటువైపు ఎవరూ రారు కదా, ఏం చూస్తున్నావు అంటే కిందపడివున్న గాజు వస్తువేదో చూపించింది. దాని మీద లైట్ పడి మెరవడంతో అదేంటో చూద్దామని వచ్చిందట. అక్కడ పక్కనే ఉన్న గది తాళం పెట్టి ఉంది. కిటికీలోంచి చూద్దామని ప్రయత్నించినా చీకటి,బూజు తప్ప ఏం కన్పించలేదు. ఆ గాజుది కూడా ఆ గదికి సంబంధించినదే అయి ఉంటుంది అనుకున్నాం.

“రోల్ నెంబర్ ప్రకారం ఈ రోజు ప్రేయర్ చేయటం స్టేజీమీద మీ వంతు అని గుర్తులేదా?” వెనకనించి పి.ఇ.టి సార్ అరుపుతో ఉలిక్కిపడ్డాం. “రోజూ క్లాసులు వదిలేసి బయటే కన్పిస్తారు, ఈ రోజు మీకు పనిష్మెంట్, గ్రౌండ్లో ఎవరికీ గుచ్చుకోకుండా రాళ్లన్నీ మొదటి పిరియడ్ అయ్యేలోగా ఏరెయ్యండి.” అని చెప్పేసి వెళ్ళిపోయారు.

ఏం రోజురా దేవుడా! అనుకుంటూ రాళ్ళు ఏరుతూ మొదటి పిరియడ్ గడిపాం. హెచ్ ఎం గారు కిటికీలోంచి మమ్మల్నే చూసి పని అయ్యాక వచ్చి కలవమన్నారు. ఆ టైమ్ లో గ్రౌండ్ లో ఏం చేస్తున్నారని తిట్టడానికేమో అని బిక్కుబిక్కుమని వెళ్తే, లోపలికి పిలిచి టేబుల్ మీద ఉన్న చాక్లెట్లు ఇచ్చారు. మేం వెళ్ళేసరికే అక్కడ సంగీతం టీచరుగారు కూడా ఉన్నారు.ఏదో పాటల సెషన్ జరుగుతోంది.

మేము మెల్లగా చాక్లెట్లు తీసుకుని బయటకి వచ్చేయబోతుంటే, హెచ్ ఎం ఆగమని చెప్పి, అక్కడే కూచుని తిన్నాక వెళ్లమన్నారు. సైలంట్ గా తింటుంటే, పాట వింటున్న మేడం మా వైపు తిరిగి అదేం పాటో చెప్పమన్నారు. మేము తలలు అడ్డంగా ఊపేసరికి, ఆవిడకి కూడా మేమెందుకు క్లాసులో లేకుండా అక్కడున్నాం అనే డౌట్ వచ్చి, అదే అడిగారు.

జరిగింది చెప్పాక, ప్రేయర్ కి ఎందుకు రాలేదు అని సీరియస్ గా అనటంతో “ఇక అయిపోయింది, ఈ రోజంతా లేటు, పనిష్మెంట్లే, అదికూడా చాక్లెట్లు ఇచ్చి మరీనూ! అసలిదంతా తనవల్లే, వెనకవైపుకి ఆ గాజుసీసా పట్టుకుని వెళ్ళింది!” అని టెన్షన్ గా అనుకోసాగాను.

మేము సమాధానం చెప్పేలోగా, మేడమే, “అరె! ఏం లేదు, వచ్చి ఉంటే మన స్కూలు నుంచి కూడా ఈ ఏడాది సైన్స్ ఫెయిర్ కి మొదటిసారి పిల్లల టీం పంపిద్దాం అనుకుంటున్నాం, పేర్లు ఇవ్వమని ఎనౌన్స్ చేసాం. ఆ విషయం తెలిసేది కదా! క్లాసులలో ఎప్పుడూ ఉన్నాలేకున్నా మన చుట్టూ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.” అనటంతో తిడతారని భయపడ్డ మా మొహాలు వికసించాయి. ‘ఇది కన్పించి వెనకవైపు ఏముందో చూడటానికి వెళ్ళాం మేడమ్’ అని బ్యాగులో గాజుసీసాను తీసి చూపించాం!

ఆవిడది చూసి, నవ్వి, “దీన్ని కోనికల్ ఫ్లాస్క్ అంటారు. ఆ వెనక మీరు చూసిన గదిలో ఇలాంటి సైన్స్ సామాను దాచిపెట్టి ఉంచారు. మీరు రోజూ వినే సైన్స్ పాఠాలు నిజమా కాదా అని పరీక్షించే ల్యాబ్ అంటారు దాన్ని. ఈ సామాను ఆ పరీక్షలకి, పరిశీలనలకి ఉపయోగపడతాయి.” అని వివరించారు.

మాకు అలా సైన్స్ కి ల్యాబ్ లు ఉంటాయని తెలుసు కానీ, ఇలా స్కూలులో కూడా ఉంటాయని తెలీదు. మాకు వెంటనే చూడాలనిపించింది. మరెందుకు మమ్మల్ని ఎప్పుడూ ఆ గదిలోకి వెళ్ళనివ్వలేదో అర్థం కాలేదు. ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. అదే అడిగాం.

మేడం నిటూర్చి, కాసేపు ఆలోచించి, “సరే! ఇప్పటిదాకా జరిగింది వదిలేయండి.మీకు ఆ గదిని చూడాలని ఉంది కదా? సైన్స్ అంటే నిజమైన ఇంట్రెస్ట్ ఉన్నవారి కోసమే ఆ సామాను కూడా. ఆ గదిని తెరిచి లోపల చూడాలంటే, ఈ సారి మన స్కూలు నుంచి సైన్స్ ఫెయిర్ లో ఏదో ఒక ప్రైజు రావాలి. నోటీసు పెటిస్తాను, అలా ప్రైజు తెచ్చినవారికే మొదట ఆ గది తాళాలు ఇవ్వబడతాయి. అంతేకాదు, ఇకముందు కూడా ల్యాబ్ కి కావాల్సినవన్నీ తెప్పించే బాధ్యత నాది. మీ సైన్స్ టీచర్లందరూ ఇకపై ల్యాబ్ లో కూడా మీకు అన్నీ నేర్పిస్తారు. కానీ మీకు నిజంగా సైన్స్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో, నాకు ఏదన్నా మోడల్ చేసి ముందుగా చూపించాలి. మోడల్ అంటే సౌరవ్యవస్థ అంటూ తొమ్మిది గ్రహాలో, ఛార్ట్ పై స్ప్రేయర్ బొమ్మనో గీసి చూపించటం కాదు. సైన్స్ ఎప్పుడూ పదిమందికి ఉపయోగపడేలా ఉండాలి.అలా ఏమన్నా ఆలోచించండి.” అన్నారు.

మేము షాక్ అయ్యాం. సైన్స్ ఫెయిర్ కి అన్ని స్కూళ్ళ వాళ్ళు వస్తారని తెలుసు. పెద్ద పెద్ద స్కూలువాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ దగ్గర అన్ని పరికరాలు, పోస్టర్లు, గడగడా ఇంగ్లీషు అన్నీ ఉంటాయి. ప్రైజులు సులభంగా కొట్టేస్తారు. పైగా మాకిది మొదటిసారి. ఎప్పుడూ వినటమే తప్ప చూసింది లేదు. “మేడం! మేము ఏం తయారుచేయగలం? మా దగ్గర ఏ వస్తువులూ లేవు కదా?’ అన్నాం.

“అదే కదా మరి ఛాలెంజి అంటే! మీ క్లాసులో బాగా చదివే మీరే ఇలా అంటే మిగతావాళ్ళు ఏం ప్రయత్నిస్తారు? ఇదిగో నేనైతే మా స్కూలు నుంచి కూడా ఈ సారి ఒక టీము వస్తుందని చెప్పేసాను, మొదటిసారైనా సరే, కనీసం ప్రయత్నించండి. మీ టీచర్లు,నేనూ ఉన్నాంగా సాయం చెయ్యడానికి! నన్ను ఎవరు ఇంప్రెస్ చేస్తే వారికే స్కూలు తరఫున టీములో చోటు దక్కుతుంది, వెళ్ళి ఇక మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకోండి!” అని ముగించారు.

explosions-clipart-lab-explosion-4

బయటకి వచ్చి మా క్లాసుల్లో, ఇంకో సెక్షన్లలో ఫ్రెండ్స్ తో ఆలోచనల్లో పడ్డాం. ఏం చేయగలం అని? మా టీచర్లు రకరకాలుగా చాలా సజెస్ట్ చేసారు. ప్రతిరోజూ సాయంత్రం స్కూలయిపోగానే మేము ఇంకా అక్కడే తిరుగుతుండేవాళ్లం  కాబట్టి, క్లాసులన్నిటికీ, స్కూలుకి తాళాలు వేసేటప్పుడు హెచ్ ఎం మేమ్ సాధారణంగా సాయం కోసం మమ్మల్నే పిలిచేవారు. ఇక ఆరోజునుండి కొన్నిరోజులపాటు తాళాలువేస్తూ ఆ వెనకవైపు గదిని బయట నుంచే చూసి వచ్చేవాళ్ళం. ఆ ఒక్క తాళంచెవి ఇంకా మేడమ్ దగ్గరే ఉండిపోయింది.

మా చెట్టుకింద వర్షం ఆలోచనల్లోంచి ఒకటి బాగనిపించి, ఫిజిక్స్ టీచర్ తో డిస్కస్ చేసాం. అలా వర్షం పడేప్పుడు వచ్చే ఉరుములనుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చనే మోడల్ ను తయారుచేయాలని అందరం నిర్ణయించుకున్నాం. దానికి కావాల్సిన వస్తువులన్నీ చాలామటుకు ఏవీ కొన్నవి కాదు, అందరూ ఇళ్ళలోంచి, చెత్తా చెదారాలలోంచి ఉపయోగపడేలా వస్తువులని వాడాం. ఫైనల్ గా ఒక  రంగులతో అలంకరించిన ఇల్లు, ఇంటికి పైన కరెంటు ఉత్పత్తయ్యి ఇంటిలోపల బల్బు వెలిగేలా ఒక మోడల్ తయారయింది. మేము స్కూలు తరఫున ఆ సంవత్సరం సైన్స్ ఫెయిర్లో పాల్గొన్నాం కూడా. అక్కడ చూసిన ఇతర మోడల్స్, కార్యక్రమాల నుంచి చాలా నేర్చుకున్నాం. ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. మాకు మూడో ప్రైజు వచ్చింది. అందరూ చాలా సంతోషించారు.

మరునాడు స్కూలు ప్రేయర్లో హెచ్ ఎం మేడమ్ స్టేజీ మీదకి పిలిచి అందరికీ దాని గురించి చెప్పి, మా సైన్స్ టీచర్ గారి చేతిలో ల్యాబ్ కి చెందిన తాళం చెవి, మా చేతుల్లో రెండు కవర్లు పెట్టారు. మా క్లాసంతా వెళ్ళి ఆ గదిని మొత్తానికి తెరచి తలా ఒక పని పంచుకుని బూజులు దులిపి శుభ్రం చేసాం. ఇప్పుడు మాకు కూడా ఒక సైన్స్ ల్యాబ్ వచ్చేసింది. ఇక వచ్చే సంవత్సరం నుంచి మేము కూడా అన్నిటిలో పాల్గొని స్కూలుకు బహుమతులు తేవాలని నిర్ణయించుకున్నాం.మేము ఎంత బాగా స్కూలులో ఉన్నవన్నీ ఉత్సాహంగా వాడితే, అంత కొత్తగా అభివృద్ధి  చేయటానికి నిధులు సమకూరుతాయని అనుభవపూర్వకంగా అందరం నేర్చుకున్నాం. ఆరోజు సాయంత్రం అందరికీ చాక్లెట్లు దక్కాయి.

మేము స్కూలు ముగిసే సమయానికి ఎప్పటిలాగానే చెట్టు దగ్గరకి వెళ్ళి మాకు పొద్దున ఇచ్చిన కవర్లను విప్పాం. అందులో ఇలా రాసి వుంది,” క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దానిని ఎంతకాలం మనలో అలానే నిలుపుకోగలమో అంత ఆ విషయంపై ఇష్టంగా మారుతుంది. పరిస్థితులు ప్రోత్సాహకరంగా, అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఈ తెలుసుకోవాలనే ఆసక్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది, సైన్సంటే కూడా అదే. పుస్తకాలలో ఇష్టాలని దాచుకోవటంతో పాటు వాటిని మన చుట్టుపక్కల చూస్తూ, వాటిని సాధించడానికి ఏం చేయాలో నిరంతరం ప్రయత్నించడమే నిజమైన గెలుపు.” అని చెరో ఫౌంటెన్ పెన్నుతో సహా ఉంది. మా బహుమతులను చూసుకుంటూ, మా నోటుపుస్తకం హెడ్ మిస్ట్రెస్ గదిలోంచి రేపు తెచ్చుకోవాలనుకుంటూ, నవ్వుకుంటూ ఇళ్ళకి బయల్దేరాం.

 

2 thoughts on “మా చిన్నప్పుడు క్యూరియా’సిటీ’లో…”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.